న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో ఉరి తీసే గదిని కనుగొన్నారు. ఢిల్లీ శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ ఈ విషయాన్ని మీడియాకు సోమవారం వెల్లడించారు. బ్రిటీష్ హయాంలో 1926 వరకు ఈ శాసనసభ పనిచేసిందని అన్నారు. దీనికి ముందు 1912 వరకు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా దీనిని పిలిచినట్లు ఆయన తెలిపారు. ఆ తరువాత దీనిని కోర్టుగా మార్చారని చెప్పారు. విప్లవకారులను ఎర్రకోట నుంచి సొరంగం ద్వారా ఇక్కడికి తీసుకొచ్చేవారని వివరించారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో సొరంగం ఉన్నట్లుగా 2016లో కనుగొన్నారని స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తెలిపారు. దీనిలో ఉరి తీసే గది ఉండవచ్చని ఊహించినట్లు చెప్పారు. తాజాగా వట్టిపోయిన గోడను పగులగొట్టగా ఉరి తీసే గది సంగతి బయటపడిందని వివరించారు. అయితే దాని కింద ఏమున్నదో తెలియదన్నారు. దీనిని పరిశీలించి పురావస్తు శాఖకు సమాచారం అందిస్తామని ఆయన చెప్పారు.