Hamid Ansari : భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో అసహనం పెరిగిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్ రాజ్యాంగ విలువలకు దూరమవుతోందని వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఇండియన్- అమెరికన్ ముస్లిమ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఓ వర్చువల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నడుస్తున్న పౌర జాతీయవాదానికి వ్యతిరేకంగా సాంస్కృతిక జాతీయవాదం అంటూ ఓ ఊహా వ్యవస్థను సృష్టించే ధోరణలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువయ్యాయని ఆయన పరోక్షంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని కాస్త మతపరమైన మెజారిటీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అలాగే రాజకీయ రంగంపై గుత్తాధిపత్యాన్ని కూడా కోరుకుంటున్నారన్నారు. మత విశ్వాసాల ఆధారంగా ప్రజలను విభజించి, అభద్రతా భావాన్ని విస్తరించాలని చూస్తున్నారని హమీద్ అన్సారీ ఆరోపించారు.