న్యూఢిల్లీ : భారత టీనేజర్లలో దాదాపు సగం మంది విటమిన్ డి (Vitamin D) లోపంతో బాధ పడుతున్నారు! మెట్రోపోలిస్ హెల్త్ కేర్ నిర్వహించిన జాతీయ విశ్లేషణలో సగం మంది టీనేజర్లలో (Teenagers) విటమిన్ డి లోపం ఉన్నట్టు కనుగొన్నారు. 2019 నుంచి జనవరి 2025 వరకు 22 లక్షల పరీక్షల ఫలితాలను ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఇందులో 46.5 శాతం మందిలో విటమిన్ డి లోపం ఉండగా, 26 శాతం మందిలో తగినంత స్థాయిలో ఈ విటమిన్ లేదు. ఎముకల ఆరోగ్యానికి, కండరాల శక్తికి, రోగ నిరోధక శక్తికి కీలకమైన డి విటమిన్ టీనేజర్లలో లోపించడం ఆందోళన కలిగిస్తోంది.
దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి లాంటి రాష్ర్టాల్లో 50 శాతం టీనేజర్లను డి విటమిన్ లోపం వేధిస్తున్నది. మధ్య భారతంలో 48.1 శాతం, ఉత్తర భారతంలో 44.9 శాతం, ఈశాన్య భారతంలో 36.9 శాతం టీనేజర్లలో డి విటమిన్ లోపాన్ని గుర్తించారు. పరిమిత సూర్య రశ్మిలో, ఎక్కువ గంటలు పని ప్రదేశాలు లేదా విద్యా సంస్థలు, ఇండ్లలోనే గడపడం కారణంగా టీనేజర్లకు తగిన డి విటమిన్ అందడం లేదని అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో విటమిన్ డి లోపం నివారణ పరీక్షల నిర్వహణ, పోషకాహారం తీసుకోవడం, జీవన శైలి మార్పులు పెరగాలని అధ్యయనం పిలుపునిచ్చింది.