బెంగళూరు: ఎల్సీఏ తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాల కోసం సరఫరా చేసిన విడి భాగాలకు సంబంధించి హైదరాబాద్ సంస్థ టెక్ ఏరో డివైజెస్ 199 ఫోర్జరీ పరీక్ష నివేదికలు సమర్పించిందని హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఆరోపించింది. దీనిపై బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీసులకు ఈ నెల 2న ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం 2022-2023 మధ్య 8 నెలల కాలంలో హెచ్ఏఎల్ ఎయిర్‌క్రాఫ్ట్ విభాగం టెక్ ఏరో డివైజెస్‌కు 18 కొనుగోలు ఆర్డర్లను జారీ చేసింది. వాటి ప్రకారం 35 విడి భాగాల విభాగాల్లో 172 వస్తువులను ఆ సంస్థ హెచ్ఏఎల్కు సరఫరా చేసింది. నిబంధన ప్రకారం టెక్ ఏరో డివైజెస్ ప్రతి వస్తువుకు సంబంధించి వివిధ పరీక్షల అసలు నివేదికలను సమర్పించాలి.
కానీ ఆ కంపెనీ వాటికి బదులుగా హైదరాబాద్‌కే చెందిన యాక్సిస్ ఇన్స్పెక్షన్ సొల్యూషన్స్ జారీ చేసిన 199 పరీక్ష నివేదికలను హెచ్ఏఎల్కు సమర్పించింది. దీంతో అనుమానం వచ్చిన హెచ్ఏఎల్ నాణ్యత విభాగం యాక్సిస్ ఇన్స్పెక్షన్ సొల్యూషన్స్‌లో 2023లో ఆడిట్ నిర్వహించి ఆ సంస్థ జారీ చేసినట్టు పేర్కొన్న ప్రతి రిపోర్ట్‌ను టెక్ ఏరో డివైజెస్ ఫోర్జరీ చేసిందని గుర్తించింది. తమ సంస్థ పేరును, సంతకాలను కావాలనే టెక్ ఏరో డివైజెస్ దుర్వినియోగం చేసిందని యాక్సిస్ ఇన్స్పెక్షన్ సొల్యూషన్స్ ధ్రువీకరించింది. దీంతో టెక్ ఏరో డివైజెస్‌పై మోసం, ఫోర్జరీ అభియోగాల కింద కేసు నమోదైంది.