గాంధీనగర్: ఒక బ్యాంకుకు సంబంధించిన సాఫ్ట్వేర్ లోపాలను హ్యాకర్లు వినియోగించుకున్నారు. డిజిటల్ మోసం ద్వారా రూ.7.34 కోట్లు కాజేశారు. దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు పది మంది నిందితులను అరెస్ట్ చేశారు. (Hackers loot Gujarat Bank) గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భావనగర్ జిల్లా సహకార బ్యాంకు లిమిటెడ్‌కు చెందిన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్) సాఫ్ట్‌వేర్‌లోని ఒక లోపాన్ని హ్యాకర్లు పసిగట్టారు. యాక్టివ్‌లో లేని నాలుగు బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేశారు. ఆ ఖాతాలకు అనుసంధానమైన మొబైల్ నంబర్లు మార్చివేశారు. ప్రతి ఖాతాలో రూ.1 కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు నకిలీ నిల్వలు ఉన్నట్లుగా బ్యాంకింగ్ వ్యవస్థను తారుమారు చేశారు.
కాగా, హ్యాకర్ల ముఠా ఆ తర్వాత రూ. 7,34,91,682 విలువైన అనధికారిక వర్చువల్ క్రెడిట్లను సృష్టించారు. కమీషన్లు తీసుకుని తమ బ్యాంకు ఖాతాలను వాడుకునేందుకు అనుమతించిన 135 మంది వ్యక్తులకు సంబంధించిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు ఆ డబ్బును బదిలీ చేసి విత్ డ్రా చేశారు.
మరోవైపు భావనగర్ జిల్లా సహకార బ్యాంకు లిమిటెడ్ అధికారులు ఈ సైబర్ మోసాన్ని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుజరాత్ సీఐడీ క్రైమ్ సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం దీనిపై దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో తొలుత ఏడుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
తన బ్యాంకు ఖాతాను అద్దెకు ఇచ్చిన సూరత్‌కు చెందిన అనిల్ ధర్మేష్భాయ్ అగ్రవత్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసి, నిధుల బదిలీకి సహకరించిన భూమిల్ నయన్‌కుమార్ పటేల్, వికాస్ పోఖర్మల్ చౌదరిలను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ సైబర్ మోసం కేసులో అరెస్టైన వారి సంఖ్య పదికి చేరింది.
అయితే దేశవ్యాప్తంగా మరో 14 నుంచి 15 బ్యాంకులపై ఈ మోసం ప్రభావం పడి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.