న్యూఢిల్లీ : భారత దేశంలోని అమెరికన్ కాన్సులేట్లలో హెచ్-1బీ వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు పదే పదే వాయిదా పడుతున్నాయి. దీంతో వేలాది మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ భవితవ్యం అనిశ్చితిలో పడింది. చాలా మంది తమ కుటుంబాలకు, అమెరికాలోని ఉద్యోగాలకు దూరమవుతున్నారు. 2025 డిసెంబర్లో మొదటిసారి ఈ ఇంటర్వ్యూల ఆలస్యం గురించి బయటపడింది. ఆ తర్వాత 2026 మార్చికి, ఆ తర్వాత 2026 అక్టోబర్‌కు వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు 2027లో జరుగుతాయని చెప్పారు. ఈ పరిస్థితి ఇప్పట్లో మారే అవకాశం లేదని ఇమిగ్రేషన్ నిపుణులు అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ వర్కర్స్ వీసా స్టాంపింగ్ కోసం భారత దేశానికి రావడం మానుకోవాలని సలహా ఇచ్చారు. ఇంటర్వ్యూ తేదీలు వాయిదా పడటం కొనసాగుతుందని తెలిపారు.
ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాలను తనిఖీ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ 2025 డిసెంబర్ 15న కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో హెచ్-1బీ వీసా దరఖాస్తుల ఇంటర్వ్యూల వాయిదాల పర్వం ప్రారంభమైంది. ఇండియన్ నేషనల్స్ వేరొక దేశంలో వీసా స్టాంపింగ్ చేయించుకునేవారు. దీనికి అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ తెర దించింది. ఫలితంగా మన దేశంలోని కాన్సులేట్లపైన దరఖాస్తుదారులు ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆశించిన దరఖాస్తుదారులకు ఏప్రిల్, మే నెలల్లో లేదా 2027లో ఇంటర్వ్యూలు జరుగుతాయంటూ ఈ-మెయిల్స్ వస్తున్నాయి.
ఈ విధంగా వాయిదా పడటం మునుపెన్నడూ జరగలేదని ఇమిగ్రేషన్ లాయర్లు చెప్తున్నారు. వేలాది మంది ఇండియన్ హెచ్-1బీ హోల్డింగ్ ప్రొఫెషనల్స్ వీసా స్టాంపింగ్ కోసం భారత దేశానికి వచ్చారు. ఈ జాప్యాల వల్ల వీరు తిరిగి అమెరికాకు వెళ్లలేకపోతున్నారు. ప్రకటిత ఇంటర్వ్యూ తేదీలు పదే పదే మారుతుండటమే దీనికి కారణం. అమెరికా నుంచి వెళ్లినవారిని తిరిగి రానివ్వకుండా చేయడానికే ఈ విధంగా వాయిదాలు వేస్తున్నారా? అనే సందేహాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కొందరు హెచ్-1బీ హోల్డర్స్ భారత దేశంలో చిక్కుకుపోగా, వారి భార్య/భర్త, పిల్లలు అమెరికాలో ఉండిపోయారు.