న్యూఢిల్లీ: విదేశాల్లో చదువుకొని (Foreign Education) అక్కడే స్థిరపడటం.. సుఖమయ జీవనాన్ని ఆస్వాదించడం.. కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది భారతీయులు కల ఇది.. కానీ ఇకపై అది సాధ్యపడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఆయా ప్రభుత్వాలు విదేశీయుల రాకను నిరోధిస్తూ ఎత్తయిన గోడలు నిర్మిస్తున్నాయి. వీసా ఫీజులు పెంచుతున్నాయి, వేతనం నిబంధనలు విధిస్తున్నాయి, విద్యార్థి వీసాల స్లాట్లు తగ్గించివేస్తున్నాయి. గత రెండేండ్ల కాలంలో అమెరికా, బ్రిటన్, కెనడా, స్వీడన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు వలసల నివారణకు నిబంధనలు కఠినతరం చేశాయి.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 80,000 వర్క్, స్టూడెంట్ వీసాలను రద్దు చేశారు. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ న్యూస్ మ్యాగజైన్ ‘వాషింగ్టన్ ఎగ్జామినర్’ ఈ విషయం వెల్లడించింది. రద్దయిన వాటిల్లో స్టూడెంట్ వీసాలు 8 వేలకు పైగా ఉన్నాయని తెలిపింది. గతంతో పోల్చితే నాన్-ఇమిగ్రెంట్ వీసాల రద్దు రెట్టింపు అయ్యిందని, పాలస్తీనీయన్లకు సంఘీభావం తెలిపినా, ఇజ్రాయెల్ చర్యల్ని విమర్శించినా.. విదేశీయులపై బహిష్కరణ వేటు వేసేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైందని వార్తా కథనం తెలిపింది.