Gyanvapi | ప్రయాగ్రాజ్, మే 12: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ శివలింగం ఆకారంలోని నిర్మాణం ఏ కాలం నాటిదో నిర్ధారించేందుకు శాస్త్రీయ సర్వే నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ను ఆదేశించింది. ఆధునిక సాంకేతిక సాయంతో సర్వే చేపట్టాలని, ఈ క్రమంలో ఆ నిర్మాణానికి ఎలాంటి నష్టం జరుగకుండా చూడాలని సూచించింది. ఈ మేరకు కార్బన్ డేటింగ్(వయసు నిర్ధారించే ప్రక్రియ)తో సహా శాస్త్రీయ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను తిరస్కరిస్తూ వారణాసి జిల్లా కోర్టు గత ఏడాది అక్టోబర్ 14న ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కనబెట్టింది.
జ్ఞానవాపి మసీదులో శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలని కోరుతూ ఓ హిందూ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై సింగిల్ బెంచ్ కోర్టు జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా గత ఏడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాల మేరకు ఏఎస్ఐ గురువారం 52 పేజీలతో నివేదిక ఇచ్చింది. శాస్త్రీయ పద్ధతి ద్వారా నిర్మాణం వయసును గుర్తించొచ్చని అందులో పేర్కొన్నది. 2022లో జ్ఞానవాపి మసీదులో సర్వే సందర్భంగా ఓ నిర్మాణం బయటపడింది. ఇది శివలింగం అని హిందూ పిటిషనర్లు చెబుతుండగా.. అది మసీదుకు చెందిన వాజుఖానా ఫౌంటెయిన్లో ఒక భాగమని మసీదు అధికారులు వాదిస్తున్నారు.
పలు సంస్థల నుంచి నివేదికల సేకరణ
కాన్పూర్, రూర్కీ ఐఐటీలు, బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లక్నో తదితర సంస్థల నుంచి హైకోర్టు నివేదికలు సేకరించింది. ప్రాక్సీ డేటింగ్ ద్వారా నిర్మాణం వయసును గుర్తించవచ్చునని తెలిపింది. ఇందుకోసం లింగం చుట్టూ ఉన్న పదార్ధాలపై అధ్యయనం అవసరమని పేర్కొన్నది. పూడిపోయిన పదార్ధం, నిర్మాణాల వివరాలు తెలుసుకొనేందుకు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్(జీఆర్పీ) ద్వారా వివరణాత్మక ఉపరితల సర్వే నిర్వహించాలని, ఆ ప్రాంతంలో ఏవైనా పురాతన కట్టడాల అవశేషాలను ఉంటే, వాటిని గుర్తించేందుకు ఇది సాయపడుతుందని ఐఐటీ కాన్పూర్ ఎర్త్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ జావెద్ ఎన్ మాలిక్ చేసిన సూచనలను అలహాబాద్ హైకోర్టు పరిగణనలోకి తీసుకొన్నది.