Dera Baba : వివాదాస్పద డేరా సచ్చా సౌదా అధినేత, అత్యాచార కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Dera Baba) కు హర్యానా ప్రభుత్వం (Haryana Govt) 30 రోజుల పెరోల్ (Perole) మంజూరు చేసింది. దాంతో ఆయన రోహ్తక్ (Rohtak) లోని సునారియా జైలు బ్యారక్ నుంచి ఈ ఉదయం 6:30 గంటల సమయంలో భారీ పోలీసు భద్రత మధ్య విడుదలయ్యారు. డేరా బాబా ఇలా పెరోల్‌పై జైలు నుంచి బయటికి రావడం ఇది 16వ సారి. జైలు నిబంధనల ప్రకారం ఒక క్యాలెండర్ ఏడాదిలో ఒక ఖైదీకి 70 రోజుల పెరోల్, 21 రోజుల ఫర్లో పొందే హక్కు ఉంటుంది.
డేరా బాబా ఈ ఏడాది ఇప్పటికే జనవరిలో 40 రోజుల పెరోల్ పొందారు. తాజా పెరోల్తో తన వార్షిక పెరోల్ కోటాను పూర్తిగా వినియోగించుకున్నట్లయింది. ఆయన జూన్ 24న తిరిగి జైలుకు వెళ్లి లొంగిపోవాల్సి ఉంటుంది. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆయన పోలీసు కాన్వాయ్ మధ్య సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. సిర్సా జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి లభించిన తర్వాతే ఆయనకు అక్కడ ఉండేందుకు అనుమతించారు. అయితే పెరోల్ కాలంలో ఆయన తన అనుచరులను లేదా భక్తులను ఒకచోట చేర్చడానికి అనుమతి లేదు. కానీ వర్చువల్‌గా వారితో మాట్లాడవచ్చు.
రామ్ రహీమ్ తరఫు న్యాయవాది జితేందర్ ఖురానా మాట్లాడుతూ.. చట్టపరమైన అర్హతల ప్రకారమే డేరా చీఫ్ విడుదలయ్యారని పేర్కొన్నారు. 2017లో దోషిగా తేలినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన తాత్కాలికంగా జైలు వెలుపలికి రావడం ఇది 16వ సారి. సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు ఆగస్టు 2017లో గుర్మీత్ రామ్ రహీమ్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఆ సమయంలో ఆయనను దోషిగా ప్రకటించిన వెంటనే పంచకులతో పాటు హర్యానా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో డేరా అనుచరులు తీవ్ర హింసాకాండకు దిగారు.
దాంతో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా గతంలో డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్, జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసుల్లో కూడా ఆయనపై ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆ రెండు కేసుల నుంచి పంజాబ్, హర్యానా హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది.