కోరాపుట్, మే 5: ఎన్నికల్లో ప్రత్యర్థులను ఓడించడానికి నేతలు ఎత్తులు పైఎత్తులు వేస్తుంటారు. అయితే ఆ ప్రత్యర్థులంతా తన బంధువులే అయితే, వారిలో ఒకరు మనవడు, ఇంకొకకరు మేనల్లుడు అయితే.. ఇదే పరిస్థితి ఎదురైంది ఒడిశాలోని రాయగఢ జిల్లా గునుపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునాథ్ గమాంగ్‌కు. అధికార బిజూ జనతాదళ్ అభ్యర్థి అయిన రఘునాథ్ మరోసారి అదే స్థానంలో ఎమ్మెల్యేగా పోటీలోకి దిగగా, ఆయనపై మనవడు (కూతురు కొడుకు) సత్యజిత్ గమాంగ్ కాంగ్రెస్ నుంచి , మేనల్లుడు త్రినాథ్ గమాంగ్ బీజేపీ తరఫున పోటీలో ఉన్నారు. కాగా, గతంలో తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని రఘునాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ వేవ్‌తో తన విజయం ఖాయమని త్రినాథ్, గతంలో రెండో స్థానంలో నిలిచిన తమదే గెలుపని సత్యజిత్ సైతం పేర్కొనడం విశేషం.