శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. తంగ్‌మార్గ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతున్నది. (Gunfight in Kulgam) ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) టాప్ కమాండర్ ఈ కాల్పుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. మంగళవారం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు విదేశీయులతో సహా 28 మంది మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడికి బాధ్యత వహించింది.
కాగా, బుధవారం తెల్లవారుజామున సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. బారాముల్లాలో భారీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఎన్కౌంటర్ తర్వాత పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రితోపాటు పాకిస్థాన్ కరెన్సీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.