Encounter : ఒడిశా (Odisha), చత్తీస్గఢ్ (Chattishgarh) సరిహద్దుల్లో గురువారం ఉదయం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు కోటగడ్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గాలింపు చర్యలు చేపట్టింది.
ఈ సందర్భంగా ఎదురుపడిన మావోయిస్టులు, భద్రతా బలగాలపై మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు బారి అలియాస్ రాకేష్, మరొకరు అమృత్గా గుర్తించారు. మరో ముగ్గురిని గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బారి తలపై రూ.22 లక్షలు, అమృత్ తలపై రూ.1.65 లక్షల రివార్డు ఉంది.