వాషింగ్టన్: షాపులోకి ప్రవేశించిన ఒక వ్యక్తి కస్టమర్‌గా నటించాడు. కౌంటర్ వద్ద ఉన్న గుజరాత్ వ్యక్తిని బెదిరించి డబ్బులు దోచుకున్నాడు. ఆ తర్వాత అతడిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. (Gujarati Man Shot Dead In US) అమెరికాలో ఈ సంఘటన జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని డింగుచా గ్రామానికి చెందిన పరేష్ పటేల్ అమెరికాలోని ఒక షాపులో పని చేస్తున్నాడు. మే 21న ఒక వ్యక్తి ఆ షాపులోకి ప్రవేశించాడు. కస్టమర్లా నటించి వస్తువులను పరిశీలించాడు.
Paresh Patel With Family
కాగా, ఆ షాపులో ఎవరూ లేకపోవడంతో క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న పరేష్ పటేల్ వద్దకు ఆ వ్యక్తి వెళ్లాడు. గన్ గురిపెట్టి అతడ్ని బెదిరించాడు. కౌంటర్లో ఉన్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. భయందోళన చెందిన పరేష్ పటేల్ ఆ వ్యక్తి చెప్పినట్లుగానే చేశాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బు దోచుకున్న తర్వాత ఆ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. పరేష్‌పై గన్‌తో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. బుల్లెట్ గాయమైన పరేష్ పటేల్ అక్కడికక్కడే మరణించాడు. ఆ షాపులోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ సమాచారం తెలుసుకున్న అమెరికా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.