Bahubali Shah | అహ్మదాబాద్ : ‘గుజరాత్ సమాచార్’ దిన పత్రిక యజమానుల్లో ఒకరైన బాహుబలి షాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం రాత్రి అరెస్ట్ చేసింది. ఆయన ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు నమోదు చేసింది. గుజరాత్లో అత్యధిక సర్క్యులేషన్ గల దిన పత్రికల్లో ‘గుజరాత్ సమాచార్’ ఒకటి. దీనిని బాహుబలి, ఆయన సోదరుడు శ్రేయాన్ష్ షా నడుపుతున్నారు. ఈడీ ఆరోపణల గురించి మేనేజింగ్ ఎడిటర్ శ్రేయాన్ష్ మాట్లాడుతూ, పాత కేసులో బాహుబలిని అరెస్ట్ చేశారని, ఆయనపై మోపిన ఆరోపణల గురించి తమకు తెలియదని చెప్పారు. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ శక్తి సింహ్ గోహిల్ మాట్లాడుతూ… ఐటీ సోదాలు జరిగిన కొన్ని గంటల్లోనే బాహుబలిని ఈడీ అరెస్ట్ చేసిందన్నారు.
ప్రధాని మోదీపైనా, ఆయన ప్రభుత్వంపైనా విమర్శనాత్మక కథనాలను రాయడమే బాహుబలి అరెస్ట్‌కు అసలు కారణమని ఆరోపించారు. గోహిల్ చేసిన ఎక్స్ పోస్ట్‌లో.. సత్యం కోసం గట్టిగా నిలబడినవారిని శిక్షించడమే బీజేపీ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ‘గుజరాత్ సమాచార్’ ఎల్లప్పుడూ అధికారానికి ఎదురు నిలిచిందని చెప్పారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల విషయంలో మోదీని, బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించినందువల్ల, మోదీ తన టూల్ కిట్‌ను తెరిచారని ఆరోపించారు. మోదీ ఐటీ, ఈడీలను ‘గుజరాత్ సమాచార్’పైనా, దాని టెలివిజన్ చానల్ జీఎస్టీవీపైనా ఉసి గొలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ శాఖ అధ్యక్షుడు ఇసుదన్ గధ్వి కూడా ఐటీ సోదాలు, ఈడీ అరెస్ట్‌ను ఖండించారు. నిర్భయ పాత్రికేయాన్ని బెదిరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.