దాహూద్ (గుజరాత్), సెప్టెంబర్ 22: పాఠాలు చెప్పి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఓ ప్రిన్సిపల్ దారుణానికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి ప్రయత్నించిన తనను అడ్డుకుందనే కోపంతో ఆరేండ్ల బాలికను హతమార్చాడు. గుజరాత్లోని దహోడ్ జిల్లా సింగ్వాడ్ తాలుకాలోని ప్రాథమిక పాఠశాలలో ప్రిన్సిపాల్ గోవింద్ నాట్ గురువారం స్కూల్కు కారులో వస్తున్నాడు.
దారిలో ఆరేండ్ల బాలికను కారులో ఎక్కించుకుని ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక ప్రతిఘటించి ఆరవడంతో గోవింద్ నాట్ ఆమె నోరు, ముక్కు మూసి వేశాడు. దీంతో బాలిక స్పృహ తప్పింది. ఆమెను కారులో అలాగే ఉంచి స్కూల్కు యధావిధిగా వచ్చాడు. సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్పృహలో లేని చిన్నారిని పాఠశాల వెనుకవైపు పడేశాడు. తల్లిదండ్రులు, బంధువులు వచ్చి గాలించగా, స్పృహ తప్పి ఉన్న స్థితిలో బాలిక కన్పించింది. ఆమెను దవాఖానకు తరలించగా మృతి చెందింది. పోలీసులు హెడ్మాస్టరే హంతకుడిగా నిర్ధారించి అరెస్ట్ చేశారు.
మసీదు ప్రాంగణంలో ఒక మతాధికారి ఐదేండ్ల బాలికపై లైంగిక దాడి చేసిన ఘటన రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో చోటు చేసుకుంది. మసీదులో మౌల్విగా పనిచేసే అస్జద్ (22) ఇంటి ఎదురుగా ఉండే ఐదేండ్ల బాలికను మసీదులోకి తీసుకుని వెళ్లి అఘాయిత్యం చేశాడు.