అహ్మదాబాద్: టాయిలెట్లో కూర్చుని హైకోర్టుకు వర్చువల్‌గా హాజరైన వ్యక్తికి గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) భారీ జరిమాన విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అతడు బేషరతుగా క్షమాపణ చెబుతానని వెల్లడించడంతో రూ.లక్ష ఫైన్ విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు రిజిస్ట్రీలో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. గత నెల 20న గుజరాత్ హైకోర్టులో జస్టిస్ నిర్జర్ ఎస్. దేశాయ్ బెంచ్ చెక్ బౌన్స్ కేసును వర్చువల్‌గా (Virtual ) విచారణ చేపట్టింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన అబ్దుల్ సమద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యాడు. వీడియోలో ‘సమద్ బ్యాటరీ’ అనే పేరుతో లాగిన్ అయిన సమద్.. మొదట బ్లూటూత్ ఇయర్ ఫోన్ ధరించి కనిపించాడు. తన ఫోన్‌ను కొంత దూరంలో ఉంచడంతో అతను టాయిలెట్ సీట్‌పై కూర్చొని ఉన్నట్లు స్పష్టమైంది. వీడియోలో అతను తనను తాను శుభ్రం చేసుకుంటూ, ఫ్లష్ ఉపయోగించి, ఆ తర్వాత టాయిలెట్ నుంచి బయటకు వెళ్లి మరొక గదిలో తిరిగి కనిపించాడు. ఈ కేసులో ఇరు పక్షాల మధ్య సామరస్యపూర్వకంగా ఒప్పందం కుదరడంతో గుజరాత్ హైకోర్టు ఎఫ్ఐఆర్ని రద్దు చేసింది. కానీ అతడు టాయిలెట్ నుంచి హాజరైనందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అయితే నిమిషం నిడివి కలిగిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై సుమోటోగా విచారణ ప్రారంభించిన జస్టిస్ ఏఎస్ సుపేహియా, జస్టిస్ ఆర్టీ వచానీతో కూడిన బెంచ్ అబ్దుల్ సమద్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియోలో అభ్యంతరకరంగా కనిపించిన అతనికి రూ.1 లక్ష జరిమానా విధించింది. కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. సంబంధిత వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి లాయర్లు, కక్షిదారులు వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు గుజరాత్ హైకోర్టు అనుమతిస్తున్నది. అంతేకాకుండా హైకోర్టులో జరిగే విచారణను కోర్టు యూట్యూబ్ చానల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు. అయితే దీనినే ఆసరగా చేసుకుని పలువురు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు. ఏప్రిల్‌లో ఒక వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా సిగరెట్ తాగుతూ కనిపించాడు. దీంతో గుజరాత్ హైకోర్టు అతనిపై రూ.50 వేల జరిమానా విధించింది. గత మార్చిలో ధవల్ పటేల్ అనే వ్యక్తి టాయిలెట్ నుంచి విచారణకు హాజరైనందుకుగాను రూ.2 లక్షల జరిమానా, రెండు వారాల పాటు కమ్యూనిటీ సర్వీస్‌ను విధించారు. ఇక ఫిబ్రవరి నెలలో మంచం మీద పడుకొని విచారణకు హాజరైన వమ్దేవ్ గఢ్వీ అనే వ్యక్తికి రూ.25 వేల జరిమానా విధించారు.