అహ్మదాబాద్: కాళ్లకు పరికరాలున్న అనుమానాస్పద పావురాలు కనిపించినట్లు ఒక బోటు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్లోని పోర్బందర్లో ఈ ఘటన జరిగింది. తన బోటుపై పని చేసే వ్యక్తి రెండు అనుమానాస్పద పావురాలను గుర్తించాడంటూ బోటు యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ పావురాల కాళ్లకు రింగు మాదిరిగా ఏదో పరికరం ఉన్నదని తెలిపాడు. నిఘా కోసం పాకిస్థాన్ నుంచి ఆ పావురాలు వచ్చి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తమ సిబ్బంది దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ స్మిత్ గోహిల్ తెలిపారు. ఆ పావురాలను పట్టుకుని వాటి కాళ్లకు ఉన్న పరికరాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపుతామని చెప్పారు.
కాగా, గుజరాత్లో కొన్ని నెలల కిందట కాళ్లకు చిప్ మాదిరిగా ఉన్న ఒక పావురాన్ని ఒక ప్రైవేట్ కంపెనీలో గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆ పావురాన్ని పట్టుకున్నారు. దాని కాళ్లకు ఉన్న పరికరాన్ని గాంధీనగర్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఆ పావురం నాటి నుంచి అటవీశాఖ కస్టడీలో ఉన్నది.