అహ్మదాబాద్: ప్రాథమిక పరీక్షకు ఎందుకు ఆలస్యంగా వచ్చావని ప్రశ్నించినందుకు ఓ ఉపాధ్యాయురాలిపై 12వ తరగతి చదువుతున్న విద్యార్థి చేయి చేసుకున్న ఘటన గుజరాత్లోని పంచ్మహల్ జిల్లాలో చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డయిన ఈ ఘటన అధ్యాపకుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగల్చడమేగాక విద్యా సంస్థల్లో భద్రత, క్రమశిక్షణపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం షెహ్రా పట్టణంలోని ఎస్జే దావే హైస్కూలో జనవరి 24న ఈ ఘటన జరిగింది.
మొహమ్మద్ అన్సారీ(18) ప్రాథమిక పరీక్షకు ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చావని మహిళా ఇన్విజిలేటర్ ప్రశ్నించగా నన్ను మా ఇంట్లోనే ఏమీ అడగరు. మీరెవరు నన్ను ప్రశ్నించడానికి? అని అంటూ ఆమె చెంప చెళ్లుమనిపించి ఆమెను తోసేసి పారిపోయాడు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు భగ్గుమన్నారు.