Srishailam Temple : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జరగబోయే ఉగాది బ్రహ్మోత్సవాల దృష్ట్యా సత్రాల నిర్వాహకులతో పోలీస్ అధికారులు సమావేశం నిర్వహించారు. 2022 ఉగాది బ్రహ్మోత్సవాల సమయంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భక్తుల భద్రత, శ్రీశైల క్షేత్ర పవిత్రత, ప్రతిష్ట రక్షణ కోసం ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్రాల నిర్వాహకులకు పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు.
1. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల దర్శనార్దం వచ్చే భక్తుల కోసం శ్రీశైలంలో తాగునీరు సమస్య తలత్తకుండా ప్రతి సత్రం ప్రధాన ద్వారం వద్ద భక్తుల కొరకు రెండు ఉచిత కూల్ వాటర్ ఫ్రిజ్‌లు ఏర్పాటు చేయాలి. వాటికి ఇనుప చైన్లతో కట్టిన నాలుగు గ్లాసులు అందుబాటులో ఉంచాలి. ఈ ఉచిత కూల్ వాటర్ ఫ్రిజ్‌లను శాశ్వతంగా ఏర్పాటు చేయాలి.
2. ప్రతి సత్రంలో నెల రోజుల బ్యాకప్‌తో కూడిన CC కెమరాలు ఉండాలి. వాటిని ప్రతి రోజు మానిటరింగ్ చేసేందుకు ఒక టెక్నీషియన్‌ను నియమించుకోవాలి.
3. ప్రతి సత్రంలో వివిధ కేటగిరీల రూములకు సంబంధించిన ధరల పట్టికను ఏర్పాటు చేయాలి. రిసెప్షన్ దగ్గర కనబడే విధంగా ధరల పట్టిక ఉండాలి. దళారులను నమ్మి భక్తులు మోసపోకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకోవాలి.
4. శ్రీశైల క్షేత్రoలో ఏపీ ఎండోమెంట్ చట్టం-1987 అమలులో ఉండటంవలన సత్రం యాజమాన్యానికి సంబంధించి ఎక్కువ మందితో సత్రాలలో సభలు సమావేశాలు నిర్వహించడం, గొడవలు పడటం చేయరాదు.
5. సత్రాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు అనగా జూదం, మద్యం సేవించడం, మాంసం తినడం లాంటి పనులు చేయరాదు.
6. కర్ణాటక భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి.
7. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు సత్రాలకు వచ్చినప్పుడు వారి పూర్తి వివరాలు ఆధార్ నెంబర్‌తో సహా రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి.
8. సత్రాలకు అనుమానిత వ్యక్తులు వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు తెలియపరచాలి.
9. సత్రాలలో ఎవరినైనా పని కోసం చేర్చుకునేటప్పుడు వారి ప్రవర్తన గురించి విచారిచి చేర్చుకోవాలి.
10. సత్రాలలో పెట్టే ఆహారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీ చేయిస్తుండాలి.