ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్రలోని పూణెలో పర్యటించారు. పూణె మెట్రో రైలును ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంఐటీ కాలేజీలో జరిగిన ప్రధాని మోదీ సభలో ఎలాంటి నిరసనలు వ్యక్తం కాకుండా ఉండేందుకు వినూత్నంగా ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారిని నల్ల దుస్తులు, నల్ల మాస్కులు తొలగించాలని ఆదేశించారు. దీంతో ఒక జర్నలిస్ట్ ధరించిన నల్ల రంగు మాస్కును తొలగించగా, నల్ల చొక్కా ధరించి వచ్చిన కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీనిపై విమర్శలు వెల్లువెత్తడంలో పూణె పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా సోమవారం స్పందించారు. కేవలం నల్ల జెండాలను మాత్రమే అనుమతించవద్దంటూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అయితే నల్ల జెండాలు, నల్ల క్లాత్తోపాటు నల్ల దుస్తులను కూడా అనుమతించకూడదని పోలీస్ సిబ్బంది పొరపడి ఉంటారని అన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ పూణె పర్యటన సందర్భంగా కాంగ్రెస్, ఎన్సీపీ కార్యకర్తలు పలు చోట్ల నిరసనకు దిగారు. దేశంలో కరోనా వ్యాప్తికి మహారాష్ట్రానే కారణమన్న ప్రధాని మోదీ, తమ రాష్ట్రాన్ని అవమానించారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ‘మోదీ గో బ్యాక్’ అన్న ఫ్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించడంతోపాటు ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.