లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువైన బాల రాముడి దర్శనం కోసం వచ్చిన మహిళ తన స్నేహితులతో కలిసి గెస్ట్ హౌస్‌లో బస చేసింది. ఆమె స్నానం చేస్తుండగా సిబ్బందిలో ఒకరు మొబైల్లో వీడియో రికార్డ్ చేశాడు. గమనించిన ఆ మహిళ కేకలు వేయగా ఆమె స్నేహితులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఏప్రిల్ 10న వారణాసికి చెందిన 25 ఏళ్ల మహిళ, నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి రాముడి దర్శనం కోసం అయోధ్యకు వచ్చింది. రామ మందిరానికి సమీపంలో ఉన్న రాజా గెస్ట్ హౌస్‌లో వారు బస చేశారు.
కాగా, శుక్రవారం ఉదయం ఆ మహిళ స్నానం చేస్తుండగా బయట ఒక వ్యక్తి నీడను చూసింది. అతడు మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తున్నట్లు ఆమె గ్రహించింది. భయాందోళన చెందిన ఆమె గట్టిగా కేకలు వేసింది. అప్రమత్తమైన మగ స్నేహితులు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఆ గెస్ట్ హౌస్‌లో పని చేసే అతడ్ని పోలీసులకు అప్పగించారు.
మరోవైపు నిందితుడిని బహ్రైచ్ జిల్లాకు చెందిన సౌరభ్ తివారీగా పోలీసులు గుర్తించారు. అతడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించారు. గతంలో ఆ గెస్ట్ హౌస్‌లో బస చేసిన పలువురు మహిళలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు ఉండటం చూసి షాక్ అయ్యారు. అతడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాజా గెస్ట్ హౌస్ అక్రమ నిర్మాణమని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ఏడీఏ) గుర్తించింది. దీంతో ఆ అతిథి గృహానికి అధికారులు సీల్ వేశారు.