న్యూఢిల్లీ: డాలరేతర కరెన్సీలతో వాణిజ్యం సాగిస్తున్న బ్రిక్స్ దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) తీవ్రంగా విమర్శించింది. ట్రంప్ ఆర్థిక, భౌగోళిక రాజకీయ విధానాల కారణంగానే డాలర్‌ను పక్కనపెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీలలో వాణిజ్య కార్యకలాపాలు సాగించాలన్న నిర్ణయానికి అనేక దేశాలు వచ్చాయని జీటీఆర్ఐ స్పష్టం చేసింది. అమెరికా విధించిన ఆంక్షలు, స్విఫ్ట్ వ్యవస్థ(200 దేశాల వ్యాప్తంగా 11,000 బ్యాంకుల మధ్య చెల్లింపులు సాగించేందుకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ) నుంచి రష్యా, ఇరాన్, వెనిజులా వంటి దేశాలను అమెరికా తప్పించడంతో డాలర్ ఆధారిత లావాదేవీలకు బదులుగా తప్పనిసరి పరిస్థితులలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం జరుగుతోందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.
డాలర్ నుంచి వేరే కరెన్సీకి మారడం తిరుగుబాటు కాదని, అది ఏకైక ప్రత్యామ్నాయమని ఆయన చెప్పారు. ప్రస్తుతం రష్యా-చైనా వాణిజ్యం రూబుల్స్ లేదా యువాన్‌లో సాగుతోందని, రష్యా నుంచి కొనుగోలు చేసే చమురుకు భారత్ రూపాయలు, దిర్హామ్స్లో చెల్లిస్తోందని ఆయన తెలిపారు. సౌదీ అరేబియా కూడా డాలరేతర వాణిజ్యానికి సిద్ధపడుతోందని ఆయన తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించాలన్న ట్రంప్ ప్రతిపాదన అమెరికాతో ప్రపంచ వాణిజ్య చర్చలను మరింత జటిలం చేస్తుందని శ్రీవాస్తవ హెచ్చరించారు. అమెరికా చర్యల కారణంగానే ఇతర దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయం వెదుక్కుంటున్నాయన్న వాస్తవాన్ని అగ్ర రాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్మరిస్తున్నారని ఆయన తెలిపారు.