న్యూఢిల్లీ : డిసెంబర్లో వస్తు సేవల పన్ను (GST) భారీగా వసూలయ్యాయి. వరుసగా ఆరో నెలా జీఎస్టీ రాబడి రూ.లక్ష కోట్లు దాటింది. డిసెంబర్ నెలలో (GST) రూ.1,29,780 జీఎస్టీ రాబడి కోట్లు వచ్చింది. ఇందులో సీజీఎస్టీ (CGST) రూ. 22,578 కోట్లు, ఎస్జీఎస్టీ (SGST) రూ. 28,658 కోట్లు, ఐజీఎస్టీ (IGST) రూ.69,155 కోట్లు (దిగుమతిపై రూ. 37,527 కోట్లతో కలిపి) వసూలయ్యాయి. సెస్ రూపేనా రూ.9,389 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 614 కోట్లతో సహా) వచ్చాయని శనివారం కేంద్రం తెలిపింది. గత నవంబర్‌లో జీఎస్టీ రూ.1,31,526 కోట్లు వసూలయ్యాయి. 2019 డిసెంబర్ నెలతో పోలిస్తే 2021 డిసెంబర్లో జీఎస్టీ 26శాతం ఎక్కువగా వసూలైంది.
మొదటి, రెండో త్రైమాసికాల్లో వరుసగా రూ.1.10 లక్షల కోట్లు, రూ. 1.15 లక్షల కోట్ల సగటు నెలవారీ వసూళ్లు కాగా, ప్రస్తుత సంవత్సరం మూడో త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1.30 లక్షల కోట్లుగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక పునరుద్ధరణ, ఎగవేత నిరోధక కార్యకలాపాలు, ముఖ్యంగా నకిలీ బిల్లర్లపై తీసుకుంటున్న చర్యలు జీఎస్టీ వసూలుకు దోహదం చేస్తున్నాయని పేర్కొంది. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిచేయడానికి జీఎస్టీ కౌన్సిల్ చేపట్టిన వివిధ రేట్ల హేతుబద్ధీకరణ చర్యలతో సైతం ఆదాయం మెరుగైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.