లక్నో: పెళ్లైన కొన్ని గంటలకే నవ వధువును వరుడు హత్య చేశాడు. (Groom Kills Bride) ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో ఇద్దరి మృతదేహాలను గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ సంఘటన జరిగింది. మార్చి 8న సాదత్ గంజ్ ప్రాంతానికి చెందిన ప్రదీప్‌కు శివానీతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొత్త జంట వరుడి ఇంటికి చేరుకున్నారు.
కాగా, శనివారం రాత్రి నవ వధూవరులు ఒక గదిలో నిద్రించారు. ఆదివారం ఉదయం వారి గది తలుపులు తెరుచుకోలేదు. వరుడి కుటుంబ సభ్యులు తలుపులు బాదినా స్పందించలేదు. దీంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. వధువు శివానీ మృతదేహం బెడ్‌పై, వరుడు ప్రదీప్ మృతదేహం సీలింగ్‌కు వేలాడటం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. నవ వధూవరుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గది లోపలి నుంచి డోర్ లాక్ చేసి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో శివానీని గొంతునొక్కి చంపిన తర్వాత ప్రదీప్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.