వెల్లడించిన మైఖెల్ పేజ్ నివేదిక
న్యూఢిల్లీ, జూన్ 8: కొవిడ్ మహమ్మారి కారణంగా ముందుకు వచ్చిన గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్ భారత్లో ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉన్నదని, రానున్న ఆరు నెలల్లో 86 శాతం మందికి పైగా ఉద్యోగులు రాజీనామా చేసే యోచనలో ఉన్నారని రిక్రూట్మెంట్ ఏజెన్సీ మైఖెల్ పేజ్ నివేదిక పేర్కొన్నది.
మెరుగైన పని-జీవన సమతుల్యత, శ్రేయస్సు, ఆనందంగా గడిపేందుకు.. తక్కువ జీతాలను తీసుకోవడానికి, ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు కూడా 61 శాతం మంది ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నది. అన్ని మార్కెట్లు, పరిశ్రమలతో పాటు సీనియర్లు, ఎక్కువ వయసు ఉన్నవారిలో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందని నివేదిక అంచనా వేసింది. కెరీర్ పురోగతి, జాబ్ రోల్ లేదా పనిచేస్తున్న ఇండస్ట్రీ మార్పు, వేతనం, కంపెనీపై అసంతృప్తి వంటివి ఉద్యోగుల రాజీనామాలకు కారణాలుగా ఉన్నాయని వివరించింది.