Tri Colour Flag | మువ్వన్నెల పతాకం ఆవిష్కరణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి 24 గంటల్లో ఎప్పుడైనా ఎగురవేయొచ్చు. అంతేకాదు పాలిస్టర్‌తో తయారైన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయవచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` కార్యక్రమంలో భాగంగా వచ్చేనెల 13 నుంచి 15 వరకు `హర్ ఘర్ తిరంగా (ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఆవిష్కరణ)` ప్రారంభించాలని నిర్ణయించింది.
ఈ మేరకు వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాల కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్-1971 చట్టాలను ఈ నెల 20న సవరిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. దీని ప్రకారం దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై పగలు గానీ, రాత్రి గానీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేయవచ్చునని తెలిపారు.
ఇక నుంచి నూలు, చేనేత, మరమగ్గం, కాటన్, పాలిస్టర్, సిల్క్ ఖాదీతో తయారు చేసిన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయొచ్చు. ఇంతకుముందు మరమగ్గాలు, పాలిస్టర్‌తో తయారైన మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసేందుకు నిబంధనలు అనుమతించేవి కాదు.