న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో (Union Budget 2025) క్యాన్సర్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది. రాబోయే మూడేళ్లలో అన్ని జిల్లా ఆసుపత్రులలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2025-26లో 200 డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
కాగా, కేంద్ర బడ్జెట్లో 36 రకాల ఔషధాలపై వంద శాతం పన్ను మినహాయింపునిచ్చారు. దాంతో రోగులపై ఆర్థిక భారం తగ్గనున్నది. అత్యవసరమైన చికిత్సల ఖర్చును తగ్గించే లక్ష్యంతో 36 రకాల ఔషధాలపై వంద శాతం కస్టమ్ డ్యూటీ మినహాయింపును ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కస్టమ్ డ్యూటీ మినహాయింపుతో క్యాన్సర్ రోగులకు అధిక ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
మరోవైపు గత ఏడాది ఫిబ్రవరిలో కూడా ప్రభుత్వం మూడు రకాల క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీని రద్దు చేసింది. జీఎస్టీ రద్దయిన ఔషధాల్లో Trastuzumab Deruxtecan, Osimertinib, Durvalumab ఉన్నాయి. తాజాగా 36 రకాల ఔషధాలపై వంద శాతం కస్టమ్ డ్యూటీ మినహాయింపుతోపాటు మరో ఆరు రకాల వ్యాధులకు సంబంధించిన ఔషధాలపై రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటిలో క్యాన్సర్ వ్యాధి చికిత్సకు వినియోగించే ఔషధాలు, అరుదైన వ్యాధులకు అవసరమయ్యే ఔషధాలు, తీవ్ర అనారోగ్యాలకు సంబంధించిన ఔషధాలు ఉన్నాయని చెప్పారు.