న్యూఢిల్లీ : పౌరులకు బైక్, ఆటో, క్యాబ్ ద్వారా రవాణా సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సహకార్ ట్యాక్సీ’ని ప్రారంభిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దేశంలో సేవలందిస్తున్న ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి కార్పొరేట్ సంస్థలతో తమ లాభాలను పంచుకుంటున్న డ్రైవర్లు నేరుగా తామే పూర్తి సంపాదనను సొంతం చేసుకొనేలా ఈ సహకార ఆధారిత రవాణా సేవలను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా పార్లమెంట్లో వెల్లడించారు. ఈ పథకాన్ని అమలులోకి తెచ్చేందుకు సహకార శాఖ మూడున్నరేండ్లుగా కష్టపడుతున్నదని తెలిపారు. ఈ పథకం అమలును ఆయన వివరిస్తూ.. దేశవ్యాప్తంగా ఉన్న రవాణా సేవలందించే ద్విచక్ర వాహనదారులు, ఆటోరిక్షాలు, క్యాబ్ డ్రైవర్లు ‘సహకార్ ట్యాక్సీ సర్వీస్’లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రయాణికులను రవాణా చేయడం ద్వారా వసూలు చేసే మొత్తం చార్జీలను డ్రైవర్లే ఉంచుకుంటారని, ప్రభుత్వ సంస్థకు వాటా చెల్లించాల్సిన అవసరముండదని వివరించారు. తద్వారా డ్రైవర్లకు ఆర్థిక భద్రత కలుగుతుందని అన్నారు. కొన్ని నెలల్లోనే సహకార్ ట్యాక్సీ దేశమంతటా విస్తరిస్తుందని తెలిపారు.