రాంచీ, మార్చి 3: గనుల రాయల్టీ, పన్నులకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై చట్టపరమైన చర్యలకు దిగుతున్నట్టు జార్ఖండ్‌లోని హేమంత్ సొరేన్ సర్కార్ ప్రకటించింది. బొగ్గు తవ్వకాలపై రూ.1.36 లక్షల కోట్ల బకాయిలను కేంద్రం పెండింగ్‌లో ఉంచిందని, వీటిని చెల్లించాలంటూ చట్టపరమైన చర్యలను చేపడుతున్నట్టు జార్ఖండ్ ఆర్థికమంత్రి రాధాకృష్ణ కిశోర్ సోమవారం అసెంబ్లీలో చెప్పారు.
సభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికంటే ముందు ప్రశ్నోత్తరాల సమయంలో ఎక్సైజ్ మంత్రి యోగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కచ్చితమైన బకాయి మొత్తాన్ని అంచనా వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులతో కూడిన సంయుక్త కమిటీ ఒకదాన్ని ఏర్పాటుచేసినట్టు చెప్పారు.
కోల్ ఇండియా సహా వివిధ సంస్థలు జార్ఖండ్‌లో బొగ్గు తవ్వకాలు చేపట్టడం ద్వారా పన్నులు, రాయల్టీ రూపంలో రాష్ర్టానికి రూ.1.36 లక్షల కోట్లు రావాల్సి ఉందని గత కొన్నేండ్లుగా జార్ఖండ్ సర్కార్ వాదిస్తున్నది. కేంద్రం నుంచి బకాయిలు రాబట్టడంపై చట్టపరమైన ప్రక్రియ కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, భూ సంస్కరణల శాఖ కార్యదర్శికి అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఓ నోటిఫికేషన్ కూడా జారీచేసింది. కేంద్రం బకాయిల్ని పెండింగ్‌లో ఉంచటం వల్ల జార్ఖండ్ అభివృద్ధికి నివారించలేని నష్టం వాటిల్లుతుందని సీఎం హేమంత్ సొరేన్ చెబుతున్నారు.