Union Govt : ప్రభుత్వరంగ బ్యాంకులు (Public Sector Banks), బీమా సంస్థలు (Insurance Companies), ఇతర ఆర్థిక సంస్థలకు కేంద్రం (Union Govt) కీలక ఆదేశాలు జారీచేసింది. ఖర్చులను భారీగా తగ్గించుకోవాలని సోమవారం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు చర్యల్లో భాగంగా ప్రయాణాలపై తీవ్ర ఆంక్షలు విధించడంతోపాటు దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని స్పష్టంచేసింది. ఈ కొత్త నిబంధనలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వంటి దిగ్గజ సంస్థలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులకు వర్తించనున్నాయి.
కేంద్ర ఆర్థిక సేవల విభాగం తాజా ఉత్తర్వులు జారీచేసింది. అత్యవసరమైతే తప్ప అన్ని రకాల సమావేశాలు, సమీక్షలు, సంప్రదింపులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించాలని కేంద్రం సూచించింది. సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల (సీఈఓ) విదేశీ ప్రయాణాల్లో పరిమితి పాటించాలని తెలిపింది. సాధ్యమైనంత వరకు విదేశీ సమావేశాలకు వర్చువల్‌గానే హాజరుకావాలని పేర్కొన్నది. వీటితోపాటు ప్రధాన కార్యాలయాలు, బ్రాంచ్ ఆఫీసుల్లో ప్రస్తుతం అద్దెకు వాడుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో వీలైనంత వరకు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని ఆదేశించింది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతలవల్ల ఏర్పడే ఆర్థిక ప్రభావాలను తట్టుకునేందుకు ఖర్చులను తగ్గించుకోవాలని, పొదుపు పాటించాలని ప్రధానమంత్రి మోదీ గతవారం పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో సుదీర్ఘకాలంగా సాగుతున్న ఉద్రిక్తతలవల్ల దేశ ఆర్థికవృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే భారత కరెన్సీ రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సౌకర్యాన్ని కూడా కల్పించాయి.