న్యూఢిల్లీ, మార్చి 25 : దేశ రాజధాని ఢిల్లీ 24, అక్బర్ రోడ్లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయాన్ని శనివారం లోగా ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీని ఆదేశించింది. ఈ బంగ్లా 48 ఏండ్లుగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్నది. కేంద్రం ఆదేశాలు రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. గత ఏడాది కాంగ్రెస్ పార్టీ కోట్ల మార్గ్‌లోని ఇందిరా భవన్లో కొత్త హెడ్‌క్వార్టర్స్‌ను ప్రారంభించడంతో కార్యాలయం అక్కడికి తరలిపోయింది.
అయితే అక్బర్ రోడ్‌లోని కార్యాలయాన్ని ఆ పార్టీ ఖాళీ చేయలేదు. అక్కడ ఇంకా పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యకలాపాలు కొనసాగించరాదని కేంద్రం గతంలో ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా పార్టీలు సొంత కార్యాలయాలు నిర్మించుకున్నాయి.