న్యూఢిల్లీ: కనీస వేతనాలు, ఆరోగ్య ప్రయోజనాలు, వృత్తిపరమైన భద్రతా చర్యలు, సామాజిక భద్రత వర్తింపుతోసహా గిగ్, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ కార్మికులకు ముఖ్యమైన రక్షణలను కల్పించడానికి ఉద్దేశించిన నాలుగు కార్మిక స్మృతులు(లేబర్ కోడ్లు) అమలు కోసం రూపొందించిన ముసాయిదా నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కోడ్ ఆన్ వేజెస్, 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్, 2020లను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. వేతనాలు, పని పరిస్థితులు, సామాజిక భద్రతపై గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. కేంద్రం విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఒకే ప్లాట్‌ఫామ్(అగ్రిగేటర్) వద్ద కనీసం 90 రోజులు పనిచేసిన లేదా అనేక ప్లాట్‌ఫామ్‌ల వద్ద కనీసం 120 రోజులు పనిచేసిన గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతా ప్రయోజనాలు వర్తిస్తాయి.
సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందడానికి అర్హులైన గిగ్ వర్కర్లకు స్పష్టమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. 2026 మార్చి నాటికి దేశంలోని 100 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రతను వర్తింపచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ప్రస్తుతం 94 కోట్ల మంది సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందుతున్నారు. రాజ్యాంగం ప్రకారం కార్మిక శాఖ ఉమ్మడి జాబితాలో ఉన్నందున లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర, రాష్ర్టాలు నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఇప్పటికే ముసాయిదా నిబంధనలను నోటిఫై చేసినందున ఇక రాష్ర్టాలు ముసాయిదా నిబంధనల విడుదల ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. 2026 ఏప్రిల్ నుంచి వీటిని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు వీలుగా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్‌పై 30 రోజుల్లోగా, మిగిలిన మూడు లేబర్ కోడ్లపై 45 రోజుల్లోగా సంబంధిత వర్గాల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను కోరింది.
న్యూఢిల్లీ, జనవరి 2: గిగ్ ఆర్థిక వ్యవస్థను గట్టిగా సమర్థించిన ఎటర్నల్ వ్యవస్థాపకుడు, సీఈవో దీపీందర్ గోయల్ గిగ్ వర్కర్లను క్రమబద్ధీకరించడం వల్ల అసమానతలు పోవని, అందుకు బదులుగా ఉపాధి తుడుచుకుపెట్టుకుపోయి గిగ్ వర్కర్లు అదృశ్యమైపోతారని హెచ్చరించారు. డెలివరీ పార్ట్నర్లు సమ్మెకు పిలుపునివ్వడం, 10 నిమిషాల్లో డెలివరీలు వంటి అల్ట్రా ఫాస్ట్ డెలివరీ నమూనాలపై విస్తృతంగా చర్చ జరుగుతుండగా దేశంలోని గిగ్ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకువస్తున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వేతనాలు, భద్రత, పని పరిస్థితులపై గిగ్ వర్కర్ గ్రూపులు ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా సంక్షేమం కన్నా వేగంగా డెలివరీలు చేయడంపైనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు దృష్టి సారించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గోయల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ గిగ్ పని చుట్టూ ఏర్పడిన అసౌకర్యం డబ్బుకు అతీతమైనదని పేర్కొన్నారు. శతాబ్దాలుగా సంపన్నులకు దూరంగా ఉండిపోయిన పేద కార్మికుడు అసమానతను నేరుగా ఎదుర్కొనలేదని ఆయన తెలిపారు.
గిగ్ పనిని నిషేధించడం వల్ల లేదా ఎక్కువ ఆంక్షలు విధించడం వల్ల గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత లభించదని ఆయన హెచ్చరించారు. వారు ఉపాధిని కోల్పోయి వారు చేస్తున్న పనే అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని గోయల్ తెలిపారు. మితిమీరిన నియంత్రణల వల్ల ధరలు పెరిగి డిమాండు తగ్గిపోయి చివరకు గిగ్ వర్కర్లకు ఆదాయ అవకాశాలు తగ్గిపోతాయని ఆయన చెప్పారు. గిగ్ వర్క్‌ని నిషేధిస్తే అసమానత పోదని, జీవనభృతే పోతుందని ఆయన హెచ్చరించారు. గిగ్ వర్కర్ల ఆదాయంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ డెలివరీ పార్ట్నర్లు నెలకు రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు సంపాదిస్తున్నారని, టిప్పులు ఇందుకు అదనమని ఆయన చెప్పారు. గిగ్ ఆర్థిక వ్యవస్థ అన్యాయంగా పనిచేస్తుంటే అందులో పనిచేసేందుకు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఎందుకు ఆసక్తి చూపుతారని ఆయన ప్రశ్నించారు.