న్యూఢిల్లీ, జూన్ 24: అద్దె గర్భం (సరగసీ) ద్వారా సంతానాన్ని పొందిన ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇకపై 180 రోజులపాటు మాతృత్వ సెలవులు పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్-1972లో సవరణలు చేసింది. సరగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకూ ప్రసూతి సెలవులు లభిస్తాయి. సరగసీ ద్వారా సంతానాన్ని పొందిన తండ్రి (కమిషనింగ్ ఫాదర్) కూడా బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదటి ఆరు నెలల్లో 15 రోజులు పితృత్వ సెలవులు పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.
ఇద్దరు బిడ్డలను పొందే వరకే ఈ సెలవులు లభిస్తాయి. సరగసీ ద్వారా సంతానాన్ని పొందిన ప్రభుత్వ ఉద్యోగినికి ఇంతకాలం ఈ సదుపాయం అందుబాటులో లేదు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఉద్యోగిని, ఒంటరి ఉద్యోగి తన పూర్తి సర్వీసు కాలంలో పిల్లల సంరక్షణ కోసం గరిష్ఠంగా 730 రోజులు సెలవులు పొందేందుకు వీలున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 52 ఏండ్లనాటి నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనలను ఈ నెల 18న నోటిఫై చేసింది.