Single Time Zone | న్యూఢిల్లీ, జనవరి 27 : సమయపాలనను ప్రామాణికం చేసే చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని అధికారిక, వాణిజ్య వేదికల వ్యాప్తంగా భారతీయ కాలమానాన్ని(ఐఎస్టీ) మాత్రమే ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసేందుకు సమగ్రమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 14 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కేంద్ర వినిమయ వ్యవహారాల శాఖ కోరింది. న్యాయ, పరిపాలన, వాణిజ్య, అధికారిక పత్రాలకు ఐఎస్టీని మాత్రమే ఏకైక ప్రామాణిక కాలమానంగా పాటించేందుకు ఒక న్యాయపరమైన స్వరూపాన్ని నెలకొల్పాలని లీగల్ మెట్రాలజీ(ఇండియన్ స్టాండర్డ్ టైమ్) రూల్స్, 2024 ఆశిస్తున్నాయి. వాణిజ్యం, రవాణా, ప్రజా పాలన, లీగల్ కాంట్రాక్టులు, ఆర్థిక కార్యకలాపాలతో సహా అన్ని రంగాలలో భారతీయ కాలమానాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలని ముసాయిదా నిబంధనలు చెబుతున్నాయి.
అధికారిక, వాణిజ్య అవసరాల కోసం ఐఎస్టీ కాకుండా వేరే కాలమానాలను సమయానికి సూచనగా ప్రస్తావించడాన్ని నిషేధించడంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో ఐఎస్టీని ప్రదర్శించడం తప్పనిసరి అని ముసాయిదా నిబంధనలు తెలిపాయి. టెలీ కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, రక్షణతో సహా కీలక జాతీయ మౌలిక సదుపాయాల రంగాలతోపాటు రానున్న 5జీ, కృత్రిమ మేధ వంటి కొత్త సాంకేతిక రంగాలలో నిర్దిష్టమైన సమయపాలనను పాటించేలా చూడడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం. ఖగోళ శాస్త్రం, సముద్రయానం, శాస్త్రీయ పరిశోధనలు, ప్రభుత్వ ముందస్తు అనుమతి ఉన్న రంగాలకు మాత్రం ఇందులో నుంచి మినహాయింపు ఉంటుందని ఆయన చెప్పారు.