న్యూఢిల్లీ, జూన్ 9: ఐఎన్ఎస్ బాజ్ వద్ద ఉన్న నావికాదళ విమానాశ్రయాన్ని విస్తరించడానికి బదులుగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా రూ. 13,000 కోట్ల వ్యయంతో కొత్తగా పౌర-సైనిక వినియోగ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పర్యావరణపరంగా సున్నితమైన దీవిలో రూ. 81,000 కోట్ల భారీ అభివృద్ధి ప్రాజెక్టుపై రాజకీయ పోరు తీవ్రమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపాదిత ద్వంద్వ ప్రయోజన విమానాశ్రయం గ్రేట్ నికోబార్ ఆగ్నేయ తీరంలోని గలథియా బే సమీపంలో ఉన్న చింగెన్లో ఏర్పాటు కానున్నట్లు ప్రభుత్వ, రక్షణ వర్గాలు తెలిపాయి. ఇది పౌర, సైనిక విమానయాన అవసరాలు రెండింటికీ ఉపయోగపడుతుంది. హిందూ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రాన్ని కలిపే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటైన మలక్కా జలసంధి పశ్చిమ మార్గాలకు సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రదేశం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది.
భూభాగ పరిమితులు, నావిగేషన్ సవాళ్లు, విస్తృతమైన సహాయక మౌలిక సదుపాయాల అవసరం కారణంగా ప్రస్తుత ఉన్న 4,500 అడుగుల రన్‌వేను సుమారు 10,000 అడుగులకు పొడిగించడం కష్టమని అధ్యయనాలు తేల్చాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కంటే రన్‌వే విస్తరణ గిరిజన నివాసాలు, అడవులు, వన్యప్రాణుల ఆవాసాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అధికారులు కూడా నిర్ధారించారు. కొత్త విమానాశ్రయం ఐదేండ్లలో పూర్తి అవుతుందని అంచనా. ఈ గ్రీన్‌ఫీల్డ్ సైట్ భవిష్యత్ విస్తరణకు ఎక్కువ స్థలాన్ని అందిస్తుందని, అలాగే వ్యూహాత్మకంగా ముఖ్యమైన అండమాన్, నికోబార్ ద్వీప సమూహంలో భారతదేశ సైనిక పరిధిని, నిఘా సామర్థ్యాలను, లాజిస్టిక్స్ ఉనికిని బలోపేతం చేస్తుందని అధికారులు వాదిస్తున్నారు. కాగా, ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది దేశ సహజ, గిరిజన వారసత్వ సంపదను ధ్వంసం చేయడమేనని
మండిపడ్డాయి.