న్యూఢిల్లీ, జూన్ 16: నీట్ (యూజీ) 2026 పునః పరీక్షకు ముందు పరీక్ష పత్రాల లీక్ ప్రయత్నాలను అడ్డుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్‌లో టెలిగ్రామ్ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను జూన్ 22 వరకు నిలిపివేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్ష కేవలం పరీక్షా సమయం, ఆ తర్వాత వెంటనే వచ్చే కాలానికి మాత్రమే పరిమితమని ఎన్టీఏ పేర్కొన్నది. టెలిగ్రామ్ యాప్‌ను నిలిపివేయడంపై స్పందిస్తూ ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే లక్షలాది మంది పౌరులకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. భారత్‌లో జూన్ 30 వరకు తమ మెసేజ్-ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని కూడా ప్రభుత్వం టెలిగ్రామ్‌ను ఆదేశించింది.
గతంలో ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి పేపర్ లీక్‌కు సంబంధించిన నకిలీ ఆధారాలను సృష్టించారని ఎన్టీఏ తెలిపింది. ఇందులో అడ్మినిస్ట్రేటర్లు గతంలో పోస్టు చేసిన మెసేజ్‌లను సవరించడం, జత చేసిన (అటాచ్డ్) ఫైళ్లను మార్చడం వంటివి చేసేవారు. అదే సమయంలో అసలు టైమ్‌స్టాంప్ (సమయ వివరాలు) అలాగే ఉండేలా చూసుకునేవారు. జూన్ 21న జరగనున్న నీట్ రీఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు టెలిగ్రామ్‌ను వ్యవస్థీకృత పద్ధతిలో ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఎన్టీఏ వివరించింది. ప్రశ్న పత్రం తమ వద్ద ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్న చానళ్లు, గ్రూప్‌లు, చాట్లను అధికారులు ఇప్పటికే తొలగించారని, అయితే మధ్యంతర చర్యలు సరిపోకపోవడంతో టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్ స్థాయిలో జోక్యం చేసుకోవడం అనివార్యమైందని ఏజెన్సీ తెలిపింది.
పేపర్ లీక్డ్ నీట్, రీ-నీట్ 2026, ప్రైవేట్ మాఫియా వంటి పేర్లతో నడుస్తున్న అనేక టెలిగ్రామ్ చానళ్లు నీట్ ప్రశ్నపత్రాన్ని అందించగలమని పేర్కొంటూ అభ్యర్థులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఎన్టీఏ ఆరోపించింది. ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం పరీక్షకు సంబంధించినదని చెబుతున్న మెటీరియల్ కోసం అభ్యర్థులు, వారి కుటుంబాల నుంచి ఈ చానళ్లు కొన్ని వేల నుంచి లక్షల రూపాయల వరకు డబ్బును డిమాండ్ చేశాయి. ఈ తాత్కాలిక ఆంక్ష వల్ల లక్షలాది మంది నిజమైన వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుందని అంగీకరిస్తూనే దేశంలోని అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్ష పవిత్రతను కాపాడటానికే ఈ చర్య తీసుకున్నట్లు ఎన్టీఏ పేర్కొన్నది.
ఈ నెల 21న జరిగే నీట్-2026 రీ టెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌ను భారత్‌లో ఈ నెల 22 వరకు తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై టెలిగ్రామ్ యాప్ ఫౌండర్ పావెల్ దురోవ్ ఐటీ మంత్రిత్వ శాఖను విమర్శించారు. ఇది తొందరపాటు నిర్ణయమని వ్యాఖ్యానించిన ఆయన.. లీక్దారులు పరీక్ష పేపర్లను వాట్సాప్, ఇతర మెసెంజర్ యాప్‌ల ద్వారా కూడా పంపే అవకాశం ఉందని పేర్కొన్నారు. టెలిగ్రామ్‌పై నిషేధం ద్వారా ఏదీ ఆగదని, లీక్‌లు ఇతర యాప్‌ల ద్వారా కొనసాగుతాయని అన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా 15 కోట్ల మంది యూజర్లు టెలిగ్రామ్ యాప్‌ను వారం రోజుల పాటు వాడలేరని ఆయన తెలిపారు. ఐటీ శాఖ నిర్ణయం పట్ల ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
నీట్ యూజీ విద్యార్థుల మరణాలపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. ఈ పరీక్షల వివాదంపై జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ, విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. దీప్కే మంగళవారం నాగపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు.
సికర్: నీట్ రీఎగ్జామ్‌కు ముందు మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని సికర్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడిని ఉమేశ్ మాలిగా గుర్తించారు. అతడు మూడోసారి జూన్ 21న నీట్-యూజీ రాయాల్సి ఉంది. తన గదిలో ఉమేశ్ ఉరి వేసుకొని కనిపించాడని అతడి అక్క, తమ్ముడు తెలిపారు. అతడి గదిలో ఆత్మహత్య లేఖ లభించింది. ‘నేను దూరంగా వెళ్తున్నాను. నేనెక్కడికి వెళుతున్నానో నాకు తెలియదు. క్షమించండి’ అని అందులో అతడు పేర్కొన్నాడు.
నీట్ సంసిద్ధతకు సంబంధించిన మానసిక ఒత్తిడితో అతడు బాధ పడుతూ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శవ పరీక్ష అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. అంతకు ముందు రోజు ఉమేశ్ తన తల్లిని జున్జున్ జిల్లాలోని తన స్వగ్రామంలో విడిచిపెట్టి వచ్చారు. సికర్ జిల్లాలో గత నెల రోజుల్లో ఆత్మహత్యకు పాల్పడిన రెండోనీట్ విద్యార్థి ఉమేశ్ మాలి.