చెన్నై: అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంగా తన ఉపన్యాసాన్ని చదవకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి తన హోదాను అవమానించారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం విమర్శించారు. తమిళనాడు అనేక గవర్నర్లను చూసిందని, కాని ఎవరూ రవి లాంటివారు కారని ఆయన వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగాన్ని చదవకుండా ముందుగానే జాతీయ గీతాన్ని ఆలపించాలని గవర్నర్ రవి ఒత్తిడి చేశారని స్టాలిన్ చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు.. డమ్మీ ఇంజిన్ ప్రభుత్వమని స్టాలిన్ శనివారం తీవ్రంగా ధ్వజమెత్తారు. తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అనివార్యమని మోదీ ప్రకటించిన కొన్ని గంటల అనంతరం స్టాలిన్ ఎదురుదాడి చేశారు.