న్యూఢిల్లీ: ప్రస్తుతం అమలులో ఉన్న ఈ20 స్థాయికి మించి పెట్రోల్‌లో ఇథనాల్ కలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకు ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని ప్రధానమంత్రి సలహాదారు తరుణ్ కపూర్ తెలిపారు. ‘ది ఇండియా షుగర్ అండ్ బయో ఎనర్జీ కాన్ఫరెన్స్ -2026’లో వర్చువల్‌గా ప్రసంగించిన కపూర్ ఇప్పటివరకూ ఈ20 కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు.
త్వరలో ఫ్లెక్సీ- ఫ్యూయల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడానికి పలు ఆటోమొబైల్ కంపెనీలు ప్రణాళికలు ప్రకటించాయని చెప్పారు. ఇప్పుడు ఫ్లెక్సీ ఫ్యూయల్ వాహనాల వైపు వెళ్లడం, ఈ20 కంటే ఎక్కువ శాతంలో ఇథనాల్‌ను కలిపేందుకు అనుమతించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కపూర్ తెలిపారు.