CBSE Portal : సీబీఎస్ఈ (CBSE) రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్‌పై సైబర్ దాడి (Cyber attack) జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం (Union Govt) కూడా అధికారికంగా ధృవీకరించింది. దాదాపు 50 మంది విద్యార్థులు పోర్టల్‌లోకి అనధికారికంగా లాగిన్ అయినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ప్రభుత్వం మీడియాకు వెల్లడించింది. కాగా, సీబీఎస్ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) పద్ధతి కారణంగా తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయంటూ కొందరు విద్యార్థులు ఇటీవల ఆందోళనలు వ్యక్తంచేశారు.
దీనిపై స్పందించిన బోర్డు విద్యార్థులకు జవాబు పత్రాల స్కానింగ్ కాపీలను అందిస్తామని, వాటిని సరిచూసుకొని రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ రీవాల్యూయేషన్ కోసం చెల్లించాల్సిన పేమెంట్ పోర్టల్‌పైనే ఇప్పుడు సైబర్ దాడి జరిగింది. సైబర్ దాడి కారణంగా రీవాల్యూషన్ ఫీజు చెల్లింపుల్లో హెచ్చుతగ్గులు కన్పించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒక్కో విద్యార్థికి చెల్లించాల్సిన మొత్తం సొమ్ము రూ.1 నుంచి దాదాపు రూ.68 వేల మధ్య వేర్వేరుగా చూపిస్తోందని పేర్కొన్నాయి.
అయితే, హెచ్డీఎఫ్సీ చెల్లింపులకు సంబంధించిన గేట్‌వేలో మాత్రమే ఈ సమస్యలు ఎదురైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సైబర్ దాడిపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఓఎస్ఎం పద్ధతి నేపథ్యంలో తమ జవాబు పత్రాలు మారిపోయాయని సీబీఎస్ఈకి పలువురు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం 20 జవాబు పత్రాలు తారుమారైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయా విద్యార్థులను సంప్రదించి వారికి సరైన జవాబు పత్రాలను కూడా అందించినట్లు తెలిపాయి.
మొత్తం 98 లక్షలకుపైగా జవాబు పత్రాలకు సంబంధించి దాదాపు 40 కోట్ల పేజీలను ఓఎస్ఎం పద్ధతి ద్వారా తాము స్కాన్ చేశామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అందులో 68 వేల పత్రాల్లో నాణ్యత సమస్యలు తలెత్తడంతో వాటిని రీస్కాన్ చేసినట్లు వెల్లడించాయి.