బెంగళూరు/న్యూఢిల్లీ: ఇటు విపక్షాలు, అటు అధికార పక్షాలు బెంగళూరు, ఢిల్లీలో మంగళవారం పోటాపొటీగా సమావేశాలు నిర్వహించాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఈ భేటీలు జరిగినట్టుగా కనిపిస్తున్నది. బెంగళూరులో మంగళవారం జరిగిన సమావేశంలో విపక్షాలు తమ కొత్త కూటమి పేరును ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజిక్ అలయన్స్(ఐఎన్డీఐఏ-ఇండియా)గా ప్రకటించాయి. అయి తే కూటమికి నాయకుడిగా ఎవరు ఉంటారన్న దానిపై నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలన్నీ ఐక్యంగా పోటీచేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదా ప్రధాని పదవిపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. అటు ఢిల్లీలో జరిగిన అధికార ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ విపక్షాలు అవినీతి, కుటుంబ పార్టీలు అంటూ పాత విమర్శలే చేశారు.
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నది.