Anna Varsity | అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై చెన్నై సిటీ పోలీసులు గుండాస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆయనకు పలు క్రిమినల్ నేరాలతో సంబంధం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు గణశేఖరన్ (37)పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) సిఫారసుల మేరకు నిందితుడు గణశేఖరన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గణశేఖరన్తోపాటు అన్నా యూనివర్సిటీ పుట్ పాత్ వద్ద బిర్యానీ హోటల్ యజమానిని కూడా గుండాస్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. గుండాస్ యాక్ట్ కింద అతడికి కనీసం ఏడాది పాటు బెయిల్ లభించదు. ప్రస్తుతం పుజల్ సెంట్రల్ జైలులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ అంశాన్ని మద్రాస్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేసింది.