న్యూఢిల్లీ, డిసెంబర్ 31: పక్కా ప్లాన్‌తో భార్యను హత్య చేసి తప్పించుకోవాలని చూసిన ఓ వ్యక్తిని గూగుల్ సెర్చ్ హిస్టరీ పోలీసులకు పట్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న మోదీనగర్‌కు చెందిన వికాస్‌కు కొన్నేండ్ల క్రితం సోనియాతో పెండ్లి జరిగింది. వికాస్‌కు వివాహేతర సంబంధాలు ఉండటంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. దీంతో భార్య అడ్డు తొలగించుకునేందుకు ఆమెను హత్య చేయాలనుకున్నాడు. ‘హత్య ఎలా చేయాలి ?’, ‘గన్ ఎక్కడ అమ్ముతారు ?’ అని గూగుల్‌లో వెతికాడు.
విషం కొనేందుకు ఫ్లిప్కార్ట్లోనూ ప్రయత్నించాడు. చివరకు సోనియాను గొంతుకోసి హత్యచేశాడు. ఆ తర్వాత డ్రామా మొదలుపెట్టాడు. హైవే వద్ద తన భార్యను దొంగలు హత్య చేశారని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే, వికాస్ ప్రవర్తనను అనుమానించిన పోలీసులు అతడి ఫోన్ తీసుకొని పరిశీలించగా గూగుల్‌లో వెతికినవి బయటపడ్డాయి. అతడిని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిని అరెస్టు చేసి, హత్యకు సహకరించిన అతడి ప్రేయసి కోసం పోలీసులు గాలిస్తున్నారు.