Google Maps | కర్నాటక రాజధాని బెంగళూరును ఐటీ క్యాపిటల్ అని పిలుస్తారు. కానీ అక్కడ ట్రాఫిక్ నరకం ఎలా ఉంటుందో అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్నవారికే తెలుసు. తాజాగా గూగుల్ మ్యాప్స్ కూడా దీనిపై ఓ వ్యక్తికి ‘ఈ ట్రాఫిక్‌లో కారు, బస్సు కంటే నడకే బెటర్ బ్రదరూ’ అంటూ ఉచిత సలహాను ఇచ్చింది. ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యాన్ని చేరుకోవడానికి కారులో అయితే 44 నిమిషాల సమయం చూపించిన గూగుల్.. నడుచుకుంటూ వెళ్తే 42 నిమిషాల్లోనే చేరుతావు అని చెప్పకనే చెప్పింది.
వివరాల్లోకెళ్తే.. అయూష్ సింగ్ అనే ఓ వ్యక్తి.. బెంగళూరులోని బ్రిగేడ్ మెట్రొపొలిస్ నుంచి కెఆర్ పురమ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఆ క్రమంలో రూట్ కోసం గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి చకచకా అడ్రస్ కొట్టాడు. అతడి గమ్యానికి సంబంధించిన వివరాలను ఫోన్ తెర మీద చూపించిన గూగుల్.. కారులో వెళ్తే 44 నిమిషాలు, రైలులో అయితే 13 నిమిషాలు (ఆ సమయానికి రైలు ఉంటే) అదే నడిచి వెళ్తే 42 నిమిషాల్లోనే వెళ్లిపోవచ్చు. క్యాబ్ గనక బుక్ చేసుకుని పోతానంటే 44 నిమిషాలు తప్పకపోవచ్చు అని వివరాలను చూపించింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను పంచుకుంటూ అయూష్.. ‘బెంగళూరులో మాత్రమే ఇలా జరుగుతుంది’ అని కారు, నడక టైమ్ వివరాలను మార్క్ చేస్తూ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశాడు.
This happens only in Bangalore pic.twitter.com/MQlCP7DsU7
— Ayush Singh (@imabhinashS) July 25, 2024
అయూష్ పోస్టు కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. గంటల వ్యవధిలోనే ఈ పోస్టుకు 3 లక్షల వ్యూస్ వేలాది కామెంట్స్ వచ్చాయి. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘అది ఐటీ క్యాపిటల్ కాదు బ్రదరూ.. ట్రాఫిక్ క్యాపిటల్’, ‘ముంబై, ఢిల్లీ, నొయిడాలో కూడా ఇంతే కదా..’, ‘మెట్రో సిటీస్ అన్ని చోట్లా ఇదే కథ’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే.. ‘ఇలాంటి పరిస్థితుల్లో నడకే బెటర్. కార్డియో ఎక్స్‌ర్‌సైజ్ అయినట్టూ ఉంటుంది’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
బెంగళూరులో సాధారణంగానే ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ఇక బిజీ హవర్స్‌లో అయితే వాహన చోదకులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. మూడు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకు పదింటికల్లా చేరుకోవాలంటే అక్కడ కనీసం గంట ముందు బయల్దేరాలి. ఇక ట్రాఫిక్‌కు తోడు వర్షం వస్తే అది నరకమే.