Google | హైదరాబాద్, జనవరి 20 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): రామాయణం అది నిజంగానే జరిగిందని ‘గూగుల్ మ్యాప్స్’ రిజల్ట్స్ కూడా ధ్రువపరుస్తున్నాయి. రావణుడిని శ్రీరాముడు హతమార్చిన రోజును విజయ దశమిగా, లంక నుంచి రాముడు కాలినడకన అయోధ్యకి చేరుకున్న సందర్భంగా దీపావళి జరుపుకొంటామన్న విషయమూ విదితమే. అయితే, ఈ రెండు పండుగల మధ్య 20-21 రోజుల ఎడం ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి గూగుల్ మ్యాప్స్‌లో శ్రీలంక నుంచి అయోధ్యకి కాలినడకన చేరుకోవాలంటే ఎన్నిరోజులు పడుతుందో వెతకండి. గూగుల్ మ్యాప్స్ 21 రోజులు చూపిస్తుంది.
పురాణాల్లో చెప్పుకొన్నట్టు పుష్పక విమానం నిజంగానే ఉండేదా? 1903లో రైట్ బ్రదర్స్ విమానాన్ని నడపడానికి ముందే.. వేల ఏండ్ల కిందటే లంకాధీశుడైన రావణాసురుడు విమానాన్ని నడిపాడా? గత కొన్నేండ్లుగా శ్రీలంకలో విరివిగా ప్రచారమవుతున్న ఈ కథలకు శాస్త్రీయపరంగా తగిన ఆధారాలు మరికొద్ది రోజుల్లో దొరికే అవకాశమున్నది. మూడేండ్ల కిందట ప్రారంభమైన ‘ఏవియేటర్ రావణ’ ప్రాజెక్టు చివరి దశకు చేరుకొన్నది. పరిశోధనలో కనుగొన్న పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనుంది.
ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని ద్రోణగిరి పర్వతాల మధ్య ఉండే ద్రోణగిరి అనే కుగ్రామ ప్రజలందరికీ హనుమంతుడు అంటే ఎంతో కోపం. యుద్ధంలో స్పృహ కోల్పోయిన లక్ష్మణుడి కోసం ద్రోణగిరి పర్వతాల్లోని సంజీవని మొక్క కోసం వచ్చిన ఆంజనేయుడు ఏకంగా పర్వతాన్ని మోసుకెళ్లాడని, దీంతో సంజీవని మొక్కతో పాటు ఇంకా ఎన్నో ఔషధ మూలికలు కూడా ఇక్కడి నుంచి తరలిపోయాయని గ్రామస్తులు వాపోయారు. అందుకే, తమ గ్రామంలో ప్రజలు తరచూ వ్యాధులబారిన పడుతున్నారని, అందుకే, దీనికి కారణమైన హనుమంతుడిపై తాము కోపంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.
భారత్, శ్రీలంకలను కలుపుతున్నట్టుగా ఉండే ‘రామసేతు’ పై అనుమానాలకు పురాతత్వ శాఖకు చెందిన డాక్టర్ అలెన్ లెస్టర్ స్పష్టత ఇచ్చారు. రామసేతు సహజసిద్ధంగా ఏర్పడినట్టు లేదని, దానిపై పేర్చిన రాళ్లు మాత్రం వేరే చోటు నుంచి తీసుకొచ్చి పేర్చినట్టుగా ఉన్నాయని అన్నారు. రామసేతు ఓ ‘సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్’ అని డిస్కవరీ సైన్స్ ఛానెల్ అభివర్ణించింది.