Time Travel | హైదరాబాద్ : ఒక ఐదారు దశాబ్దాల క్రితం నాటి హైదరాబాదో, ఢిల్లీనో చూడాలనుకుంటే పాత చిత్రాల కోసం ఇకపై వెతుక్కోవాల్సిన పనిలేదు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అలాంటి సౌకర్యాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. టైమ్ ట్రావెల్ మాదిరిగా పనిచేసే ఈ టూల్ ద్వారా గతంలో ఆయా పట్టణాలు, నగరాలు, ట్రాఫిక్, రవాణా సౌకర్యాలు, వీధులు, పరిసరాలు, నదులు, కొండలు, చెరువులు ఎలా ఉండేవో మనం పాత చిత్రాల ద్వారా స్పష్టంగా తిలకించవచ్చు.
ఈ సౌకర్యాన్ని పొందాలంటే గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ ఎర్త్‌లో మనకు కావాల్సిన ప్రదేశాన్ని వెతకాలి. తర్వాత లేయర్స్ ఆప్షన్‌లోకి వెళ్లి, ‘టైమ్ లేప్స్’ను ఎంచుకోవాలి. మీరు కోరుకున్న కాలానికి, ఇప్పటికీ ఆయా ప్రదేశాల్లో వచ్చిన మార్పులు, తేడాలను చూడవచ్చు. ఈ గూగుల్ టైం ట్రావెల్ ఫీచర్ ద్వారా ప్రపంచంలోని ప్రముఖ నగరాలైన బెర్లిన్, లండన్, ప్యారిస్ లాంటి నగరాలకు చెందిన చిత్రాలను 1930 నుంచి చూడవచ్చు. వివిధ ప్రాంతాలకు సంబంధించిన 28 వేల కోట్ల చిత్రాలను ఇందులో చూసి వర్చువల్ ప్రయాణ అనుభూతిని పొందేలా ఈ ఫీచర్‌ను రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు.