న్యూఢిల్లీ: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థి వీసాల చుట్టూ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో వేలాదిమంది భారతీయ విద్యార్థుల కల చెదిరిపోతున్నది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారే కాకుండా ఇప్పటికే అక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల ప్రణాళికలను ఇది దారుణంగా దెబ్బతీసింది. అమెరికా వెళ్లాలనుకునే వారికి ప్రస్తుత పరిస్థితులు కఠినంగా మారాయని గ్రాండింగ్ డాట్ కామ్ వ్యవస్థాపకురాలు మమతా షెకావత్ ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా జైపూర్‌కు చెందిన రాంపాల్ సింగ్ పేరును ప్రస్తావించారు. ఆయన కుమారుడు ఈ ఆగస్టులో అమెరికా వెళ్లబోతున్నాడు. అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. స్టూడెంట్ లోన్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఆయన తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తున్నాడని షెకావత్ పేర్కొన్నారు. అమెరికా విధాన మార్పులతో ప్రతి ఒక్కరి ఆర్థిక స్థిరత్వం, వారి పిల్లల భవిష్యత్తు రెండూ ప్రమాదంలో పడ్డాయని ఆమె చెప్పారు. అస్పష్టమైన, లేదంటే చిన్నచిన్న కారణాలకే విద్యార్థులను బహిష్కరించడం వల్ల ఆ కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు.
అమెరికాలో విధానపరమైన అస్థిరత కారణంగా తల్లిదండ్రులు ఇప్పుడు అమెరికా విద్యపై పునరాలోచనలో పడ్డారు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. 2024లో 3.31 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలు, కళాశాలల్లో చేరారు. ఒకప్పుడు అమెరికాలో అవకాశాలు సమృద్ధిగా కనిపించినప్పటికీ ఇప్పుడు పరిస్థితులు తిరగబడ్డాయి. చాలామంది అనిశ్చితిని, భవిష్యత్తుపై ఆందోళనను ఎదుర్కొంటున్నారు. మరోవైపు, అమెరికాలో అవకాశం వచ్చినా వెళ్లాలా? వద్దా? అని మరికొందరు ఆలోచిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా ఒక సెమిస్టర్ తర్వాత వెనక్కి పంపితే అప్పుడు పరిస్థితేంటని, ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి సంగతేంటని చాలామంది ఆలోచిస్తున్నారు. ఇది విద్యార్థులతోపాటు వారి కుటుంబాలను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. ముస్కాన్ అనే విద్యార్థిని ఇప్పటికే యూఎస్ స్టడీ వీసా సంపాదించింది. అయితే, ఇప్పుడు చిన్నచిన్న విషయాలకే విద్యార్థులను వెనక్కి పంపుతుండటంతో తానక్కడికి వెళ్లినా చదువు పూర్తిచేయగలనా? లేదా? అన్న సందిగ్ధంలో పడిపోయింది.
సూరత్‌కు చెందిన వస్త్రవ్యాపారి బ్రిజేష్ పటేల్ (50)ది మరో కథ. ఆయన తన కుమారుడిని అమెరికా వర్సిటీలో చదివించాలని కలలు కన్నారు. అందుకోసం దశాబ్ద కాలంగా డబ్బులు వెనకేసుకొస్తున్నారు. తనన కలలను సాకారం చేసుకునేందుకు భార్య నగలు అమ్మేశారు. బంధువుల నుంచి అప్పు కూడా తీసుకున్నారు. అయితే, ఇప్పుడు వీసా అస్థిరత కారణంగా స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకోకపోవడమే మంచిదని కుమారుడికి సలహా ఇచ్చారు. దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది మాస్టర్స్ ప్రోగ్రాం కోసం పటేల్ కుమారుడు (21) రెండు యూఎస్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ సంపాదించాడు. కన్సల్టెన్సీ సర్వీసులు, అప్లికేషన్ ప్రాసెస్ వంటి వాటి కోసం పటేల్ ఇప్పటికే రూ. 7 లక్షలు ఖర్చు చేశారు. కాగా, అహ్మదాబాద్‌లో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నడుపుతున్న సుబాష్ దెవాత్వల్ మాట్లాడుతూ అమెరికాలో మన విద్యార్థులకు ఇంకా భవిష్యత్తు ఉందా? అంటూ రోజూ లెక్కలేనని ఫోన్లు వస్తున్నట్టు చెప్పారు.
అమెరికాలో అస్థిర పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు ఇప్పుడు ఇతర దేశాలను ఎంచుకోవచ్చని రోస్ట్రమ్ ఎడ్యుకేషన్ సహ వ్యవస్థాపకుడు సంజోగ్ ఆనంద్ చెప్పారు. విద్యార్థులు అమెరికా బదులుగా హాంకాంగ్, యూకే, యూరప్, ఆస్ట్రేలియాను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. హాం కాంగ్లో స్కాలర్షిప్, ఆర్థిక సాయం వంటి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు. అమెరికాలో వీసా ఆంక్షలు రోజురోజుకు కఠినంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఏమీ చేయకుండా ఉండటమే ఉత్తమమని అన్నారు. నేటి తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలు పెద్ద కలలు కనాలని ప్రోత్సహిస్తున్నారని, కానీ అందుకోసం వారి భద్రతను, మనశ్శాంతిని పణంగా పెట్టకూడదని మమతా షెకావత్ అన్నారు. అయితే, ఈ సమస్యలు తాత్కాలికమేనని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.