Maharashtra : మహారాష్ట్రలోని మరాఠీ రాని ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మరాఠీ భాష నేర్చుకునేందుకు ఏడాది గ్రేస్ పీరియడ్ విధించింది. అంటే, మరాఠీ రాకపోయినా ఏడాదిపాటు డ్రైవర్లుగా కొనసాగవచ్చు. ఏడాదిలోపు మరాఠీ భాష నేర్చుకోవాలి. మహారాష్ట్రలో ఆటోలు, కార్లు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా మరాఠీ నేర్చుకోవాల్సిందే అంటూ ఇటీవల అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా ఆప్ బేస్డ్ డ్రైవర్లు మరాఠీ నేర్చుకోవడాన్ని తప్పనిసరి చేసింది. మరాఠీ రాకుంటే వారికి అనుమతులు రద్దు చేస్తామని, రాష్ట్రంలో వాహనాలు నడపడానికి అనుమతివ్వబోమని తెలిపింది. దీనిపై మరాఠీ యేతర డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.
ఇదే సమయంలో రాష్ట్రంలోని ఆటో రిక్షా, ట్యాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ సభ్యులు తాజాగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిశారు. తమకు మరాఠీ నేర్చుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. మరాఠీ రాని క్యాబ్ డ్రైవర్లు, ఆటో రిక్షా డ్రైవర్లకు ఏడాదిపాటు గ్రేస్ పీరియడ్ విధించారు. ఈ ఏడాదిలోపు వారు తప్పనిసరిగా మరాఠీ నేర్చుకోవాలి. ఇప్పటికే మరాఠీ కోర్స్ పూర్తి చేసిన వారికి ఇటీవలే ప్రభుత్వం సర్టిఫికెట్లు జారీ చేసింది.