న్యూఢిల్లీ, జనవరి 10: ప్రపంచంలో అత్యంత ఖరీదైన లోహాల్లో బంగారం ఒకటిగా మనమంతా పరిగణిస్తాం. కాని ఆశ్చర్యకరంగా వెనెజువెలాలో బంగారం చాలా చౌకట. ఓ కప్పు టీ లేదా కాఫీ కన్నా 24 క్యారెట్ల బంగారమే చాలా తక్కువ ధరకు లభిస్తుందని తెలుస్తోంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో, అక్కడి కరెన్సీ విలువ ఎంతగా పతనమైపోయిందో ఈ వార్తలే వెల్లడిస్తున్నాయి. భారత్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.13,800 వరకు ఉంది. ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి వెనెజువెలాలో ఉంది. అక్కడ 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర మన కరెన్సీలో లెక్కిస్తే కేవలం రూ.181 మాత్రమే ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర సుమారు రూ.166గా ఉంది. మన దేశంలో ఓ కప్పు టీ లేదా కాఫీ ధరతో వెనెజువెలాలో ఓ గ్రాము బంగారం కొనుక్కోవచ్చు.
వెనెజువెలాలో ప్రస్తుతం ఓ గ్లాసుడు పాలు లేదా ఓ బిస్కెట్ ప్యాకెట్ కన్నా చవకగా బంగారం లభిస్తోంది. ఆకాశాన్నంటిన బంగారం ధరను చూసి భారతీయులు కండ్లు తేలేస్తుంటే వెనెజువెలా పౌరులు నిత్యావసర వస్తువుల ధరలను చూసి బేజారవుతున్నారు. ఆ దేశ కరెన్సీ బోలివర్ విలువ పతనం అయిపోవడమే అందుకు కారణం. ద్రవ్యోల్బణం, ఆర్థిక నిర్వహణ వైఫల్యం, కరెన్సీ సంక్షోభంతో వెనెజువెలా సతమతమవుతున్నది. ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపాయి. అధ్యక్షుడిగా నికోలస్ మదురో ఉన్న కాలంలో పెద్ద మొత్తంలో బంగారాన్ని విదేశాలకు ఎగుమతి చేసినట్లు వార్తలు వచ్చాయి. అప్పులను చెల్లించడానికి ప్రభుత్వం బంగారం నిల్వలను వాడుకుంది. దీంతో 2024 నాటికి బంగారం అధికారిక నిల్వలు తరిగిపోయాయి. వెనెజువెలా వద్ద ఇప్పుడు సుమారు 161 టన్నుల బంగారం నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తున్నది.