న్యూఢిల్లీ : విదేశాల నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటున్నట్లు వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. భారత్లోకి గోధుమలను దిగుమతి చేసుకునే యోచన లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి గతంలో వేడిగాలుల కారణంగా గోధుమల ఉత్పత్తి ప్రభావితమైందని, ఆ తర్వాత విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ వార్తలను ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.
దేశీయ అవసరాలను తీర్చేందుకు అవసరమైనంత స్టాక్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉందని చెప్పింది. ఇదిలా ఉండగా.. భారత్ మే 13న గోధుమల ఎగుమతిని నిషేధించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార సంక్షోభం నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నది. గ్లోబల్ మార్కెట్లో భారత్ ఎగుమతులు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని, ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్రమంత్రి గోయల్ పేర్కొన్నారు.