Goa Fire | గోవా నైట్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై నైట్ క్లబ్ యజమాని సౌరభ్ లూత్రా తొలిసారిగా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అయితే, ప్రమాదం తర్వాత సౌరభ్ పరారీ పరారయ్యారు. క్లబ్ యజమానులు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రా కోసం గోవా పోలీసుల బృందం ఢిల్లీకి వెళ్లింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్లో క్లబ్ ఓనర్ల పేర్లను చేర్చారు. ఈ క్రమంలో సౌరభ్ లూత్రా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనపై నైట్ క్లబ్ విచారం వ్యక్తం చేసింది. బాధితులకు సానుభూతిని ప్రకటించారు.
ఈ దుఃఖ సమయంలో బాధితులకు అండగా నిలుస్తామన్నారు. బాధితుల కుటుంబాలకు సహాయం చేయడానికి యాజమాన్యం సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటుందన్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం.. సౌరభ్ లూత్రా గోవాలో ఎక్కువగా కనిపించరు. పలు చట్టపరమైన విషయాల్లనూ ఆయన తన తరఫున ప్రతినిధులను పంపుతుంటారు. నైట్‌క్లబ్‌కు ఆయన నెలకోసారి మాత్రమే వస్తారని.. సిబ్బందిని అరుదుగా మాట్లాడుతుంటారని క్లబ్ సిబ్బంది పలువురు తెలిపారు. ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాదం కేసులో క్లబ్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మోదక్ (49), జనరల్ మేనేజర్ వివేక్ సింగ్ (27), బార్ మేనేజర్ రాజీవ్ సింఘానియా (32), గేట్ మేనేజర్ ప్రియాంషు ఠాకూర్ (32)లను పోలీసులను అరెస్టు చేశారు.
పోలీసుల దర్యాప్తులో నైట్‌క్లబ్‌లో పలు లోపాలు, అక్రమ నిర్మాణాలను వెలుగు చూశాయి. అంతే కాకుండా అగ్నిమాపక నిబంధనలు ఉల్లంఘించినట్లుగా గుర్తించారు. నైట్ క్లబ్ ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు ఇరుగ్గా ఉన్నాయని.. దాంతో ప్రమాదం జరిగిన సమయంలో తప్పించుకోలేకపోయినట్లు తేలింది. నైట్ క్లబ్ బ్యాక్ వాటర్‌లో ఉండగా.. ఇరుకైన మార్గం ఉండడంతో మంటలను వేగంగా అదుపులోకి తేవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫలితంగా ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాదంలో మృతుల సంఖ్య 25కి పెరగ్గా.. ఇందులో 14 మంది నైట్‌క్లబ్ సిబ్బంది ఉన్నారు.